Prabhas: కొత్తవారికి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం.. 15న ఆడిషన్స్!

Producers of Salar invite new talent for their film
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్'
  • అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్
  • అన్ని కేటగిరీలలోనూ అవకాశాలు
  • ఏ వయసు వారైనా ఆడిషన్స్ కి వెళ్లచ్చు  
 ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో 'ఆదిపురుష్'తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే చిత్రంలో కూడా నటించనున్నాడు. అలాగే, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'సలార్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ చిత్రంలో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించడానికి దర్శక నిర్మాతలు సంకల్పించారు. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. 'మీలోని ప్రతిభను చూపించి, అవకాశాన్ని దక్కించుకోండి.. సలార్ లో నటించే ఛాన్స్ ను మిస్ కాకండి' అంటూ సంస్థ పేర్కొంది.

ఇందుకోసం ఈ నెల 15న హైదరాబాదు శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు ఆడిషన్స్ ఉంటాయనీ, ఒక నిమిషం నిడివి నటనతో కూడిన వీడియోతో అక్కడికి రావాలనీ కోరింది. టాలెంట్ వున్న వారు ఏ వయసు వారైనా రావచ్చని, అన్ని కేటగిరీలకూ ఆడిషన్స్ వుంటాయని తెలిపారు.

హైదరాబాదు తర్వాత బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే రకమైన ఆడిషన్స్ ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెలలో షూటింగును ప్రారంభించి, అదే ఏడాది సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. సో.. ప్రభాస్ సినిమాలో నటించాలని కోరుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు!
Prabhas
Salar
Prashanth Neil

More Telugu News