Monolith: కొలంబియా గ్రామీణ ప్రాంతంలో బంగారు దిమ్మె ప్రత్యక్షం... వీడని మిస్టరీ!

  • ప్రపంచంలో పలు చోట్ల లోహపు దిమ్మెల ప్రత్యక్షం
  • తొలిసారిగా అమెరికా ఉటా ఎడారిలో కనిపించిన దిమ్మె
  • వెండి, ఇతర లోహాలతో తయారైన దిమ్మెలుగా గుర్తింపు
  • కొలంబియాలో అందుకు భిన్నంగా పసిడి దిమ్మె
  • ఏలియన్స్ పనేనంటూ ప్రచారం
Golden monolith appears in rural Colombia

గత నెలలో అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి దిమ్మెలే రుమేనియా, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. ఇవి ఎలా ప్రత్యక్షమవుతున్నాయో అర్థంకాక అధికారులు, ప్రజలు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు. తాజాగా కొలంబియాలో బంగారంతో చేసిన దిమ్మె కనిపించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

కొలంబియా గ్రామీణ ప్రాంతమైన చియాలో ఇది దర్శనమిచ్చింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ఈ దిమ్మెలన్నీ వెండి, ఇతర లోహాలతో తయారైనవి కాగా, కొలంబియాలోని దిమ్మె పసిడి కాంతులీనుతూ సవాల్ విసురుతోంది. ఈ బంగారు దిమ్మెను చూసిన స్థానికులు ప్రపంచంలోని మిగతా దిమ్మెలను నియంత్రించే శక్తి దీనికుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రహాంతర వాసులే ఈ దిమ్మెలను భూమిపై పాతుతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.

కాగా, ఇలాంటి దిమ్మెలను తయారుచేస్తారని గుర్తింపు ఉన్న 'ద మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్' సంస్థ వ్యవస్థాపకుడు మాటీ మో దీనిపై అస్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఈ గ్రూప్ మూడు దిమ్మెలను విక్రయించిందన్న సమాచారంపై ఆయనను ప్రశ్నించగా, ఇప్పుడా దిమ్మెలు తన చేయి దాటిపోయాయని వెల్లడించారు.

ఒకవేళ మాటీ మో గ్రూప్ ఈ దిమ్మెలను విక్రయించినా, అవి ప్రత్యక్షమైన ప్రదేశాలు మానవ సంచారం లేని ప్రాంతాల్లో ఉన్నాయి. పైగా అక్కడికి వాటి రవాణా ఎలా చేశారన్నది కూడా ప్రశ్నార్థకమైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటి గురించి అధికంగా చర్చ జరుగుతోంది. ఈ లోహపు దిమ్మెల ఫొటోలు సందడి చేస్తున్నాయి.

More Telugu News