KCR: ఎల్లుండి నిర్వహించనున్న భార‌త్ బంద్‌కు మా మద్దతు: కేసీఆర్

kcr supports bharath bundh
  • నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌
  • టీఆర్ఎస్ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటుంది
  • రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా చట్టాలు
  • ఉపసంహరించుకునే వరకు పోరాటం  
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో రైతులు జరుపుతోన్న చర్చలు కూడా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో బంద్‌ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తెలిపారు.

తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటారని, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో  తాము వ్యవసాయ బిల్లులను  వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పార్టీ భారత్ బంద్‌ను విజయవంతం చేయాలనుకుంటోందని, ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.
KCR
TRS
Telangana
India

More Telugu News