Bandi Sanjay: కారు.. సారు.. ఇకరారు.. అని జీహెచ్ఎంసీ ఫలితాలతో నిరూపితమైంది: బండి సంజయ్

  • ముగింపు దశకు చేరిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్  
  • గణనీయ స్థాయిలో విజయాలు సాధించిన బీజేపీ
  • కేసీఆర్ పాలనకు రిఫరెండం అన్న బండి సంజయ్
  • విర్రవీగితే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు
Bandi Sanjay comments on GHMC results

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థాయిలో డివిజన్లు గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నాంది అని స్పష్టం చేశారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నది మరోసారి తేలిందని పేర్కొన్నారు. మొన్న దుబ్బాకలో ఇదే తరహా ఫలితం వచ్చిందని, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటిందని అన్నారు. విమర్శలు చేయడంలో తప్పులేదని, కానీ అహంకారంతో విమర్శలు చేస్తే ప్రజలు సహించరని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

టీఆర్ఎస్, కేసీఆర్ స్వార్థపూరిత, అహంభావ రాజకీయాలకు గ్రేటర్ ఎన్నికలు రిఫరెండంగా భావిస్తున్నామని తెలిపారు. కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు భాగ్యనగర ప్రజలు ఓటేశారన్న విషయం వెల్లడైందని వివరించారు. దుబ్బాకలో ముఖ్యమంత్రి అల్లుడి ఇజ్జత్ మీద దెబ్బకొట్టారు, ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి కొడుకు ఇజ్జత్ మీద కొట్టారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి అని వివరించారు.

ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూస్తే... బీజేపీ 43 డివిజన్లలో నెగ్గి 7 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. అధికార టీఆర్ఎస్ 53 డివిజన్లలో విజయం సాధించి రెండింట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం 42 డివిజన్లలో విజయం సాధించి 1 డివిజన్ లో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది.

More Telugu News