Burevi: తమిళనాడు తీరాన్ని సమీపిస్తున్న 'బురేవి'... నేడు, రేపు ఏపీకి భారీవర్ష సూచన

Burevi cyclone braces towards Tamilnadu southern coast
  • శ్రీలంక తీరాన్ని దాటిన 'బురేవి' తుపాను
  • అర్ధరాత్రి తర్వాత తమిళనాడు తీరం దాటనున్న తుపాను
  • తమిళనాడు, కేరళకు అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'బురేవి' తుపాను శ్రీలంక తీరం దాటి తమిళనాడు తీరం దిశగా పయనిస్తోంది. ఈ అర్ధరాత్రి తర్వాత పంబన్, కన్యాకుమారి మధ్య బురేవి తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో 80 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. దీని ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

తమిళనాడుతో పాటు కేరళలోని 7 జిల్లాలపై 'బురేవి' ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బులెటిన్ లో పేర్కొన్నారు. కాగా, తాజా వాతావరణ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. 'బురేవి' దూసుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు.

అటు, తుపాను నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం నుంచి తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దక్షిణ తమిళనాడులోని రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాల్లో ఒక మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, కేరళలోనూ ఇదే తరహాలో నేడు, రేపు కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఎవరైనా వేటకు వెళ్లివుంటే వెంటనే తీరానికి చేరుకోవాలని ప్రత్యేక బులెటిన్ లో స్పష్టం చేశారు.

కాగా, 'బురేవి' తుపాను ఈ ఉదయానికి పంబన్ కు తూర్పు, ఆగ్నేయ దిశగా 110 కిమీ దూరంలో, కన్యాకుమారికి పశ్చిమ, వాయవ్య దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Burevi
Cyclone
Tamilnadu
Kerala
Andhra Pradesh
Bay Of Bengal

More Telugu News