HCU: పెట్రోలు అధికంగా వాడినందుకు హెచ్సీయూ అధికారిపై సీబీఐ కేసు... విచారణలో విస్తుపోయే వాస్తవాలు!

  • ఐదేళ్లలో ఇంధన ఖర్చు రూ.10 లక్షలు
  • విచారణలో రూ. 30 కోట్ల విలువైన అక్రమాస్తులు
  • కేసును లోతుగా విచారిస్తున్నామన్న అధికారులు
CBI Case Against HCU Officer for Illegal Assets

ఐదు సంవత్సరాల వ్యవధిలో తన వాహనాలకు పెట్రోలు, డీజిల్ నిమిత్తం రూ. 10 లక్షలను ఖర్చు చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర కుమార్ పై కేసు నమోదు చేసి విచారించిన సీబీఐ, విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. 2014 నుంచి 2019 మధ్య తన ఐదు వాహనాలకు ఆయన అధికంగా పెట్రోలును వాడారంటూ, ఎంక్వయిరీ ప్రారంభం కాగా, ఆయన అక్రమంగా దాదాపు రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారని అధికారులు తేల్చారు.

రవీందర్ తో పాటు హెచ్సీయూలోనే పనిచేస్తున్న ఆయన భార్య సుజాత పేరిట కూడా చాలా ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. ఈ మేరకు ఇద్దరిపైనా ఇల్లీగల్ అసెట్స్ చట్టాల కింద కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఆరు ఓపెన్ ప్లాట్లు సహా, కోట్ల విలువైన స్థిరాస్తులను ఆయన సంపాదించారని అధికారులు అంటున్నారు.

తన అధికారాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన అక్రమాస్తులు సంపాదించారని, ఈ ఐదేళ్ల కాలంలో ఆయన, ఆయన భార్య కలసి ఆదాయపు పన్ను లావాదేవీల కింద రూ. 35 లక్షలను చెల్లించారని గుర్తించారు. ఈ ఐదేళ్లలో వారు రూ.1.82 కోట్ల ఖర్చును చూపించారని, మొత్తం కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు తెలియజేశారు.

More Telugu News