Bandi Sanjay: కేసీఆర్ లో భయం పట్టుకుంది.. మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికీ లేదు: బండి సంజయ్

Fear started in KCR says Bandi Sanjay
  • భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పాకిస్థాన్ లో ఉందా?
  • ఏ గుడికి రమ్మంటారో చెప్పండి... నేను వస్తా
  • ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తనది కాదని ఎస్ఈసీ కూడా చెప్పారు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తాను వెళ్లడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని... హైదరాబాదులో వేరే ఆలయాలు లేవా? అని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పాకిస్థాన్ లో ఉందా? బాంగ్లాదేశ్ లో ఉందా? లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి వల్లే హైదరాబాదుకు భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చెప్పారు. తన సవాల్ స్వీకరించి ఆలయం వద్దకు కేసీఆర్ వస్తారని భావించానని.. కానీ, ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో భయం పట్టుకుందని... ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఏ గుడి దగ్గరకు రమ్మంటారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసురుతున్నానని అన్నారు.

ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తనది కాదని ఎస్ఈసీ కూడా చెప్పారని... దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలతో బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరి చేశారని... ఒక ఛానల్ లోగోను మార్చి తమపై విష ప్రచారం చేసేందుకు యత్నించారని అన్నారు.

20 శాతం ఉన్న ముస్లింల గురించి కేసీఆర్ రెచ్చగొట్టినట్టు మాట్లాడొచ్చు కానీ... 80 శాతం మంది హిందువుల గురించి తాను మాట్లాడకూడదా? అని సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఎవరికీ లేదని, ఆ శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలల్లో బీజేపీ గెలిస్తే... వరద సాయం రూ. 10 వేలు వచ్చిన వారికి మరో రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News