Divyavani: శవ రాజకీయాల గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉంది: దివ్యవాణి

TDP leader Divyavani slams YCP MLA Roja
  • తిరుమలలో చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేసిన రోజా
  • ఘాటుగా స్పందించిన దివ్యవాణి
  • చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, శవరాజకీయాలేనంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమలలో వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు. శవరాజకీయాల గురించి, సంప్రదాయాల గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్సార్ ను పంచలూడదీసి కొడతానని వ్యాఖ్యానించిందీ, కేసీఆర్ ను తాగుబోతు అన్నదీ ఈ రోజాయేనని, ఇప్పుడు పార్టీలో తన పరపతి పెంచుకోవడం కోసం, పదవుల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే రీతిలో రోజా దిగజారిపోయిందని దివ్యవాణి విమర్శించారు.

అసలు చంద్రబాబు గురించి మాట్లాడ్డానికి ఒక స్థాయి ఉండాలని, రోజాకు అది లేదని స్పష్టం చేశారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబును చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్లు, నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. "నీ వెకిలివేషాలు ప్రదర్శించడానికి ఇదేమీ జబర్దస్త్ షో కాదు... శవరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీనే. అలాంటి పార్టీలో ఉన్న నువ్వు శవరాజకీయాల గురించి మాట్లాడుతున్నావా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు నంద్యాలలో భూమా అఖిలప్రియ వేసుకున్న దుస్తులను విమర్శించినప్పుడు ప్రజలు చీపుర్లతో కొట్టి, నీ మొహాన పేడనీళ్లు కొట్టారన్న విషయం మర్చిపోయి, ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.

ఇక, వైసీపీ మంత్రులను దివ్యవాణి సీజనల్ వ్యాధులతో పోల్చారు. ప్రజల్లో తమ పాలనపై అసంతృప్తి కలుగుతున్న సమయంలో హడావుడి చేస్తూ, మీడియా ముందుకు వచ్చి ఆంబోతుల్లా అరుస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తుంటారని ఆరోపించారు. వైసీపీ నేతలకు ఇదొక ఆనవాయితీ అయ్యిందన్నారు.
Divyavani
Roja
Chandrababu
Tirumala
YSRCP
Telugudesam

More Telugu News