passes away: ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవీప్రియ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

devipriya passes away
  • అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస 
  • అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట వంటి పుస్తకాలు రాసిన దేవీప్రియ
  • కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా, గేయ రచయితగా గుర్తింపు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు దేవీప్రియ(71) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి చేరి, పరిస్థితి విషమించడంతో ఈ రోజు కన్నుమూశారు. దేవీప్రియ అసలు పేరు షేక్‌ ఖ్వాజా హుస్సేన్‌. దేవీప్రియ పేరుతో రచనలు చేస్తూ అదే పేరుతో ఆయన  సుపరిచితుడయ్యారు.
 
ఉదయం, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆయన ‘రన్నింగ్‌ కామెంటరీ’ పేరుతో కవితలు రాసేవారు. ప్రజాతంత్ర, హైదరాబాద్‌ మిర్రర్‌లోనూ ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం వంటి పలు పుస్తకాలు రచించారు. పలు సినిమాలకు పాటలు కూడా రాశారు.

దేవీప్రియ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని సీఎంవో పేర్కొంది. ‘ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ దేవీప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని సీఎం అన్నారు. శ్రీ దేవీప్రియ సాహిత్య ప్రతిభకు 'గాలి రంగు' రచన మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.
passes away
Telangana
KCR

More Telugu News