Mohan Raja: తమిళ దర్శకుడికి చిరంజీవి సినిమా ఆఫర్?

Tamil director gets offer from Chiranjeevi
  • 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు 
  • 'లూసిఫర్' నుంచి తప్పుకున్న సుజిత్, వినాయక్
  • రామ్ చరణ్ కోసం ప్రయత్నించిన మోహన్ రాజా
  • లూసిఫర్ బాధ్యతలు అప్పగించిన మెగాస్టార్  
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. దీని తర్వాత మరో రెండు రీమేక్ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' కాగా, మరొకటి తమిళ హిట్ సినిమా 'వేదాళం'. వీటిలో 'వేదాళం'కి మెహర్ రమేశ్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ఎటొచ్చి, 'లూసిఫర్'కే దర్శకుడి విషయంలో కాస్త అనిశ్చితి నెలకొంది.

మొదట్లో ఈ చిత్రానికి దర్శకుడిగా సుజీత్ ని అనుకున్నప్పటికీ, కుదరలేదు. తర్వాత వీవీ వినాయక్ రంగంలోకి వచ్చినప్పటికీ, ఆయనా సెట్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా తమిళ యువ దర్శకుడు మోహన్ రాజాకి ఆ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఇది కూడా చాలా గమ్మత్తుగా జరిగిందంటున్నారు.

తమిళంలో ఇప్పటికే కొన్ని హిట్ సినిమాలను రూపొందించిన మోహన్ రాజా ఇటీవల రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి ఆయనను కలుస్తున్నాడు. అయితే, ఇదే సమయంలో చిరంజీవి అతనికి 'లూసిఫర్' బాధ్యతలు అప్పగించినట్టు తాజా సమాచారం. దీంతో ప్రస్తుతం మోహన్ రాజా చిరంజీవి సినిమా స్క్రిప్టు విషయంలో పడినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పూర్తయ్యాకనే, రామ్ చరణ్ తో ఈ దర్శకుడి సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా తనయుడితో సినిమా చేద్దామని వెళితే.. తండ్రి సినిమాకు పనిచేసే లక్కీ ఛాన్స్ ను మోహన్ రాజా పొందినట్టు చెబుతున్నారు. అన్నట్టు, మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ గతంలో చిరంజీవితో 'హిట్లర్' వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
Mohan Raja
Chiranjeevi
Ramcharan
Editor Mohan

More Telugu News