Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృత్యువాత

  • ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారిపై ఘటన
  • మృతుల్లో ఆరుగురు చిన్నారులు
  • వాహనాన్ని కట్ చేసి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు  ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. కుండా నుంచి ప్రయాగ్‌రాజ్‌వైపు ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నప్పటికీ అప్పటికే వాహనంలోని అందరూ మృతి చెందారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలను వెలికి తీయడం వారికి సాధ్యపడలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నుజ్జుగా మారిన బొలెరో వాహనంలో మృతదేహాలు చిక్కుకుపోవడంతో దానిని ఎక్కడికక్కడ కట్‌చేసి వాటిని వెలికి తీశారు. బాధితులు నబాబ్ గంజ్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Uttar Pradesh
Road Accident
prayagraj
lucknow

More Telugu News