GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, ఆయన తనయుడి రాజీనామా

Senior leader Bhikashapathi Yadav and his Son quits Congress
  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్
  • బుజ్జగించినా మనసు మార్చుకోని నేతలు
  • కాంగ్రెస్ నేతలతో బీజేపీ మంతనాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని  భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల మొదటి రోజైన నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినప్పటికీ ఆయన బెట్టువీడలేదు. వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్‌పై అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం వల్లే ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది. అయితే, తనకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడినట్టు భిక్షపతి యాదవ్ తెలిపారు.

కాగా, నగరానికే చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నగరంలో పట్టున్న మరో 10 మంది కాంగ్రెస్ నాయకులతో బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు, అభ్యర్థులకు బీఫారాలు జారీ చేసే విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పార్టీపై అలకబూనారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల కమిటీల్లో ఉన్న అంజన్ కుమార్, అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆయన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
GHMC Elections
BJP
Congress
bikshapathi yadav
Ravikumar yadav

More Telugu News