Jagga Reddy: వారి ఉసురు తగిలి కేసీఆర్ కుటుంబం పతనమవుతుంది: జగ్గారెడ్డి

KCR family will collapse one day says Jagga Reddy
  • తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి
  • రైతులను మభ్యపెడుతూ ప్రభుత్వం కాలం గడిపేస్తోంది
  • రైతులకు అన్ని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
రైతులను కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వంచిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పాలకులు సిగ్గుపడాలని అన్నారు. రైతుల ఆత్మహత్యల వార్తలు లేకుండా ఏరోజూ వార్తాపత్రికలు రావడం లేదని చెప్పారు. అయితే రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ రికార్డుల్లో చూపడం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని అన్నారు.

చనిపోయిన రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాన్ని పెట్టిందని... కానీ, రైతు బతకడానికి స్కీములు పెట్టలేదని జగ్గారెడ్డి విమర్శించారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ చెప్పిందని... రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రుణమాఫీ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు. రైతులను మభ్యపెడుతూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇబ్బంది ఉంటే ప్రభుత్వం వద్దకు వెళ్తారని... కానీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని, అందుకే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల వద్దకు వెళ్తోందని మండిపడ్డారు. రైతుల శాపం తగిలి ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం పతనమవుతుందని జోస్యం చెప్పారు.

రైతులకు ఎకరాకు రూ. 20 వేల చొప్పున అన్ని పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని... లేకపోతే రెండు, మూడు రోజుల్లో సంగారెడ్డి రైతులతో కలిసి ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకే రైతులు పంట వేశారని... ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని చెప్పారు.
Jagga Reddy
Congress
KCR
TRS
Farmers

More Telugu News