Chiranjeevi: నిబంధనల ప్రకారం చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే: తెలంగాణ ఆరోగ్య శాఖ!

Telangana Health Department says Chiranjeevi Should Stay in Quarantine
  • ఒకసారి పాజిటివ్ వస్తే పాజిటివ్ గానే భావించాలి
  • తప్పుడు రిపోర్టని తేలినా జాగ్రత్తలు తప్పనిసరి
  • ఐసీఎంఆర్ ప్రొటోకాల్స్ ప్రకారం నడచుకోవాలి
  • వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
ఒకసారి కరోనా పాజిటివ్ గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం, క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన వేళ, నటుడు చిరంజీవికి తొలుత పాజిటివ్ వచ్చి, ఆపై అది నెగటివ్ గా తేలిన విషయం ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై స్పందించిన శ్రీనివాసరావు, ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. ఆ తరువాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, క్వారంటైన్ లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కాగా, తొలుత తనకు కరోనా సోకిందని, లక్షణాలు లేవని గత వారంలో ప్రకటించిన చిరంజీవి, ఆపై తప్పుడు ఫలితం వచ్చిందని, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం, ఫలితం తప్పుగా వచ్చిందని తేలినా, క్వారంటైన్ లో ఉండాల్సిందే.

కరోనా టీకాపైనా స్పందించిన ఆయన, కేంద్రం నుంచి అందుతున్న సంకేతాల మేరకు జనవరి లేదా ఫిబ్రవరిలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తేనే కరోనాకు దూరంగా ఉండవచ్చని సూచించారు.

Chiranjeevi
Telangana
Corona Virus
Quarantine Centre

More Telugu News