Telangana: పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి లేని పరీక్ష.. తెలంగాణ ప్రభుత్వం యోచన

Telangana govt decided to ease tenth class question papers amid coronavirus fear
  • వచ్చే నెల నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
  • పదో తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు
  • ఏప్రిల్ చివరిలో ఇంటర్, మేలో టెన్త్ పరీక్షలు!
కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా, అంటే డిసెంబరు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈసారి 40 మార్కులతో పరీక్షలు నిర్వహించాలని, చాయిస్‌లను పెంచాలని నిర్ణయించింది. కొన్ని సెక్షన్లలో ఎ/బి టైప్ ప్రశ్నలు ఉంటే, పార్ట్-బిలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల సంఖ్యను పెంచనుంది. ఫలితంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించవచ్చని యోచిస్తోంది.

అయితే, ఇంటర్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయకూడదని, ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కనుక మార్పులు చేస్తే, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ముందుగా అనుకున్నట్టు వచ్చే నెల నుంచి విద్యాసంస్థలు తెరిస్తే సిలబస్ పూర్తి చేసేందుకు కనీసం ఐదు నెలల సమయమైనా పడుతుంది. కాబట్టి ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో, పదో తరగతి పరీక్షలను మే నెలలో నిర్వహిస్తే బాగుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.
Telangana
Tenth Exams
Corona Virus
question papers

More Telugu News