Nirmala Sitharaman: కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman explains post covid situation in country
  • భారత్ ఆర్థికమాంద్యంలోకి జారుకుంటోందన్న నిపుణులు
  • దేశంలో పలు రంగాలు గాడిన పడుతున్నాయన్న నిర్మల
  • జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయని వివరణ
భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో కొవిడ్ ప్రభంజనం తర్వాత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, అనేక రంగాలు క్రమంగా కుదుటపడుతున్నాయని వివరించారు.

గత నెలలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని తెలిపారు. గతేడాది అక్టోబరు నాటి జీఎస్టీ వసూళ్లతో పోల్చితే ఇది 10 శాతం అధికం అని వెల్లడించారు. ఈ అక్టోబరులో రూ.1.05 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయని, బ్యాంకు రుణాల శాతం పెరిగిందని, ఎఫ్ డీఐల శాతం కూడా 13 శాతం పెరుగుదల నమోదు చేసిందని వివరించారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ పథకం ప్రకటించారు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ జీతంతో ఈపీఎఫ్ఓ నమోదిత సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిని ప్రోత్సహించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ ఉపయోగపడుతుందని చెప్పారు.
Nirmala Sitharaman
Econmy
India
COVID19

More Telugu News