Corona Virus: అమెరికాలో 24 గంటల్లో 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన వైనం

corona cases in usa
  • కరోనా బాధితుల సంఖ్య మొత్తం 1,02,38,243 
  • మృతుల సంఖ్య మొత్తం 2,39,588
  • ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్యలో పెరుగుదల
అమెరికాలో కరోనా విజృంభణ మరింత పెరిగింది. ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా ఎన్నడూలేని విధంగా 2,01,961 కొత్త కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 1,02,38,243 కి పెరిగింది.  24 గంటల్లో మరో 1,535 మంది మరణించడంతో మృతుల సంఖ్య మొత్తం 2,39,588కి చేరింది.

అంతేగాక, రెండు నెలల్లో మరో 1,10,000 మంది కరోనాతో మరణించే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ తెలిపింది.   ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ప్రజలు మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని  అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ అన్నారు.

కొంతకాలం పాటు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ పనుల్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా‌ నిబంధనల్ని పాటించాలని తెలిపారు. కాగా, డిసెంబరు నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా 'హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌' సెక్రటరీ అలెక్స్‌ అజర్ అన్నారు. తమ టీకా 90 శాతం సత్ఫలితాలిస్తోందని ఫైజర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ‌ సంస్థకు నెలకు 20 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని అజర్ తెలిపారు.
Corona Virus
COVID19
USA

More Telugu News