Bihar: మారుతున్న బీహార్ రాజకీయం.. సీఎం పీఠంపై కొత్త వ్యక్తి.. కేంద్ర కేబినెట్‌లోకి నితీశ్?

Is BJP want to offer Nitish Kumar to Central Cabinet Post
  • బీహార్ పీఠంపై కొత్త వ్యక్తిని కూర్చోబెట్టాలని బీజేపీ యోచన
  • బీజేపీ  ఆఫర్‌ను నితీశ్ అంగీకరించే అవకాశం లేదంటున్న విశ్లేషకులు
  • అదే జరిగితే చిరాగ్ పాశ్వన్ విషయంలో వస్తున్న వార్తలు నిజం అవుతాయంటున్న వైనం
బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో నితీశ్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని భావిస్తున్నవేళ మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నితీశ్ కుమార్ స్థానంలో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి, ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, నితీశ్ స్థానంలో వచ్చే ఆ కొత్త వ్యక్తి ఎవరనేది మాత్రం గోప్యంగా ఉంది. దీంతో నితీశ్ అంతటి సమర్థత కలిగిన నాయకుడు బీజేపీలో ఎవరున్నారన్న చర్చ జరుగుతోంది.

అయితే, విశ్లేషకుల మాట మరోలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్‌ను సీఎంగా అంగీకరించడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదని అంటున్నారు. నితీశ్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. నితీశ్‌ను సీఎంగా అంగీకరించకుంటే అది బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

నితీశ్‌ను దెబ్బకొట్టేందుకే చిరాగ్ పాశ్వాన్‌ను ఎన్డీయే నుంచి బయటకు పంపించారంటూ వస్తున్న వార్తలను ఇది నిజం చేసినట్టు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయే, చిరాగ్ పార్టీ ఎల్‌జేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ప్రకారమే బీజేపీ పోటీ చేసిన చోట చిరాగ్ తన అభ్యర్థులను నిలబెట్టలేదన్న వాదనకు ఇది మరింత బలం చేకూరుస్తుందని విశ్లేషిస్తున్నారు. జేడీయూ అభ్యర్థుల ఓటమిలో ఎల్జేజీ కీలక పాత్ర పోషించింది.  
Bihar
Nitish Kumar
BJP
Central minister
JDU

More Telugu News