Nirmala Sitharaman: ఇకపై రూపే డెబిట్ కార్డులు మాత్రమే తొలి ఆప్షన్... బ్యాంకులకు కేంద్రం ఆదేశం!

Banks May Issue Rupay Cards Only Says Nirmala Seetaraman
  • ఆధార్, పాన్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్ లైన్
  • మార్చి వరకూ పొడిగించే అవకాశాలున్నాయి
  • ఐబీఏ సర్వసభ్య సమావేశంలో నిర్మలా సీతారామన్
ఇకపై బ్యాంకులు తమ కస్టమర్లకు డెబిట్ కార్డులను ఇవ్వాలంటే, తొలి ఆప్షన్ గా రూపే కార్డులను మాత్రమే ఆఫర్ చేయాలని అన్ని బ్యాంకులకూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక, అన్ని బ్యాంకు ఖాతాలను ఆధార్, పాన్ కార్డులతో అనుసంధానించాలని కూడా స్పష్టం చేసింది.

 ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 73వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్యాంకర్లు అందరూ రూపే కార్డును తప్పనిసరిగా ప్రమోట్ చేయాలని అన్నారు.

"బ్రాండ్ ఇండియా ప్రొడక్ట్ గా ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ కార్డును ఎవరు వాడుతున్నా, అది రూపే కార్డుగానే ఉండాలి" అని తన ప్రసంగంలో ఆమె వ్యాఖ్యానించారు.

 "దేశ ఆర్థిక వృద్ధికి బ్యాంకులు ఎంతో సహకరిస్తున్నాయి. అయితే, ఆర్థిక స్థిరత్వం దిశగా మరింత కృషి చేయాలి. ఇంకా ఆధార్ సంఖ్యతో అనుసంధానం కాని ఖాతాలు ఉన్నాయని వినేందుకు నేను సిద్ధంగా లేను. డిసెంబర్ 31లోగా అన్ని ఖాతాల అనుసంధానం జరిగిపోవాలి. మీ ఖాతాల్లో వెరిఫికేషన్ పూర్తికాని ఖాతాలు ఉండటానికి వీల్లేదు" అని ఆమె స్పష్టం చేశారు.

అలాగే, బ్యాంకర్ల కోరికపై ఈ డెడ్ లైన్ ను ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకూ...అంటే మార్చి 31 వరకూ పొడిగించేందుకు అవకాశాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ప్రతి బ్యాంకూ అందిపుచ్చుకోవాలని సూచించిన నిర్మలా సీతారామన్, బ్యాంకుల నిర్వహణ మరింత సమర్థవంతం కావాల్సి వుందని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు కూడా నాన్ డిజిటల్ పేమెంట్లను నిరుత్సాహపరిచే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

"భారత మాజీ రక్షణ మంత్రిగా నేను ఒకటే చెప్పదలచుకున్నాను. ప్రతి బ్యాంకు కూడా తమ ఉద్యోగులను సైనికుల మాదిరే చూడాలి. ఉద్యోగులంతా మీ కుటుంబంలోని సభ్యులనే అనుకోండి. సర్వీసులో ఉన్నా, పదవీ విరమణ చేసినా అందరినీ ఒకేలా చూడండి. సైన్యంలో ఇదే జరుగుతుంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఇదే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాను" అని కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Nirmala Sitharaman
IBA
Rupay Cards

More Telugu News