Vijayashanti: మొదట లక్ష మెజారిటీ అన్నారు... చివరికి ఒక్క ఓటుతో గెలిచినా చాలన్నారు: టీఆర్ఎస్ నేతలపై విజయశాంతి వ్యాఖ్యలు

Vijayasanthi responds on Dubbaka By Polls result
  • దుబ్బాక ఫలితంపై విజయశాంతి స్పందన
  • కేసీఆర్ నిరంకుశత్వానికి జవాబే దుబ్బాక తీర్పు అని వ్యాఖ్యలు
  • కుటుంబ పాలన కొట్టుకుపోతుందని స్పష్టీకరణ
  • దుబ్బాక ప్రజలు ఉద్యమానికి ఊపిరులూదారని వెల్లడి
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాజయం ఎదురవడం పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు, కేసీఆర్ దొర నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని అభివర్ణించారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు లొంగలేదని, పాలకులపై గూడుకట్టుకున్న వ్యతిరేకతను తమ ఓట్ల రూపంలో స్పష్టం చేశారని వెల్లడించారు. ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆర్ఎస్ చెబుతోందని, అయితే ఈ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏమన్నారో ఓసారి గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

"దుబ్బాకలో టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా అని వ్యాఖ్యానించారు. చివరికి, ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనని అన్నారు. లక్ష మెజారిటీ వస్తుందని చెప్పి, ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి కొద్ది వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి" అంటూ విమర్శలు సంధించారు.

ఏదేమైనా దొర ఆధిపత్య, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరిలూదారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. చైతన్యపూరితమైన తెలంగాణలో, భవిష్యత్ లో జరిగే పోరాటాల్లో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని వ్యాఖ్యానించారు.
Vijayashanti
TRS
KCR
Dubbaka
Congress

More Telugu News