Pawan Kalyan: బండి సంజయ్ నాయకత్వ పటిమ, రఘునందన్ వ్యక్తిత్వం అంటూ ప్రశంసల వర్షం కురిపించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan congratulates Bandi Sanjay and Raghunandan on Dubbaka win
  • దుబ్బాకలో బీజేపీ విక్టరీ
  • బీజేపీపై ప్రజల్లో నమ్మకానికి ఈ గెలుపే నిదర్శనమన్న పవన్
  • ఈ ఎన్నికల్లో యువత విశేషంగా పాల్గొన్నారని వెల్లడి
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బండి సంజయ్ నాయకత్వ సామర్థ్యం, రఘునందన్ రావు నిబద్ధత దుబ్బాకలో బీజేపీ విజయానికి బాటలు వేశాయని అభివర్ణించారు. దుబ్బాక ఫలితంపై పవన్ ఓ ప్రకటన చేశారు. దుబ్బాకలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. బీజేపీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా ప్రజల నమ్మకానికి నిదర్శనమే దుబ్బాకలో నేటి విజయం అని పవన్ వివరించారు.

బీజేపీ తెలంగాణ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి నేడు దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ ఈ విజయానికి మార్గం వేసిందని, అభ్యర్థి రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఆయన చిత్తశుద్ధి గెలుపు హారాన్ని అందించిందని తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో యువకులు విశేషంగా పాల్గొనడం ఒక శుభపరిణామం అని, రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానని జనసేనాని పేర్కొన్నారు.
Pawan Kalyan
Bandi Sanjay
Raghunandan Rao
Dubbaka
BJP
Telangana

More Telugu News