Kishan Reddy: హైదరాబాద్ కు సముద్రాన్ని తెచ్చిన ఘనుడు కేసీఆర్: ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి

Union minister Kishna Reddy slams Telangana CM KCR
  • ఇటీవలి వరద పరిస్థితులపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
  • కేసీఆర్ నిర్లక్ష్యంతో వందల గ్రామాలు నీటమునిగాయని ఆరోపణ
  • ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే జీహెచ్ఎంసీ పరిధిలో వందల గ్రామాలు నీటమునిగాయని ఆరోపించారు. వరదలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. హైదరాబాద్ కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ కే చెందుతుందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలపై ఉన్న ధ్యాస ప్రజల క్షేమంపై లేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ పైనా విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేటాయించిన రూ.67 కోట్లు ఏంచేశారో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. హైదరాబాదులో గుంతలు లేని రోడ్లను కేటీఆర్ చూపించగలడా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తండ్రీకొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడ్ బండ్ సిక్ విలేజ్ హాకీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy
KCR
Floods
Hyderabad
GHMC

More Telugu News