Joe Biden: ప్రతి ఓటు లెక్కించేంత వరకు అందరూ సంయమనం పాటించాలి: జో బైడెన్

Joe Biden responds on ongoing situation
  • కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ప్రజాస్వామ్యం కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుందన్న బైడెన్
  • న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ట్రంప్
  • ప్రజల తీర్పే అంతిమం అన్న బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. ప్రతి ఓటు లెక్కించేంత వరకు అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియ కొన్నిసార్లు గందరగోళంగా అనిపిస్తుందని, అయితే సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

అమెరికా అధ్యక్ష పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, బైడెన్ అందుకు 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం బైడెన్ కు 264 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 214 ఓట్లతో కొనసాగుతున్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయింది. మరో ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. తనకు వ్యతిరేక ఫలితం వచ్చిన రాష్ట్రాల్లో ట్రంప్ న్యాయవ్యవస్థలను ఆశ్రయిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో స్థానిక చట్టాలు, నిబంధనల కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యే అవశాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులపై జో బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఓటు చాలా పవిత్రమైనదని, అంతిమంగా ప్రజల తీర్పే అధ్యక్షుడు ఎవరో నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం ముందు మరే శక్తి పనిచేయదని పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.

కాగా, నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో పోలైన ఓట్లను కూడా లెక్కించడం వల్లే తనకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నది కూడా ఈ అంశంపైనే.
Joe Biden
Elections
Donald Trump
USA

More Telugu News