Grace Marks: డీబార్ అయిన విద్యార్థులు కూడా పాస్... తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
- తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో 338 మంది డీబార్
- పలు కారణాలతో పరీక్షకు హాజరుకాని 27 వేల మంది
- అందరికీ గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయం
సాధారణంగా పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ల విద్యా భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంటుంది. కానీ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు డీబార్ అయిన విద్యార్థుల పాలిట వరంలా మారింది. తెలంగాణలో ఈ ఏడాది జరిగిన ఇంటర్ పరీక్షల్లో 338 డీబార్ అయ్యారు. వారిని వివిధ కారణాలతో మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించింది.
అయితే, తెలంగాణ ఇంటర్ బోర్డు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 27,589 మంది ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించింది. వారిలో డీబార్ అయిన 338 మందితో పాటు, పరీక్షలకు హాజరు కాని 27,251 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరికీ గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.