APSRTC: తొలి రోజు దాదాపు ఖాళీగానే తిరిగిన ఏపీ, టీఎస్ ఆర్టీసీ బస్సులు!

No Travellers for 1st Day Interstate Buses Between AP and TS
  • స్వల్ప సంఖ్యలోనే సరిహద్దులను దాటిన బస్సులు
  • ప్రయాణికుల సంఖ్య పెరిగితే బస్సులను పెంచుతాం
  • దీపావళి నాటికి పూర్తి స్థాయిలో సర్వీసులు
నిన్న రాత్రి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మొదలైన అంతర్రాష్ట్ర బస్సులు తొలిరోజున దాదాపు ఖాళీగానే తిరిగాయి. బస్సులు తిరగడంపై ప్రజల్లో అవగాహన లేకనే స్పందన లేదని అధికారులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు, కర్నూలు నుంచి హైదరాబాద్ కు రెండు వైపులా ప్రయాణాలు సాగిస్తున్న వారు బస్టాండ్లకు వెళ్లడం లేదు. ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిలోనే ప్రయాణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం నాడు స్వల్ప సంఖ్యలోనే బస్సులు సరిహద్దులను దాటాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగితే, ఆ మేరకు బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. దీపావళి నాటికి పూర్తి స్థాయిలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు.

కాగా, నిన్న రాత్రి నుంచే రెండు రాష్ట్రాల మధ్యా కొన్ని రూట్లలో అటు ఏపీఎస్ఆర్టీసీ, ఇటు టీఎస్ ఆర్టీసీ తమ రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. విజయవాడ - హైదరాబాద్, హైదరాబాద్ - తిరుపతి రూట్లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇంకా పలు డిపోల నుంచి తిరగాల్సిన బస్సుల సంఖ్య ఖరారు కాకపోవడంతో వాటికి మాత్రం రిజర్వేషన్లు ప్రారంభం కాలేదు.
APSRTC
TSRTC
Buses
Inter State
Ocupency

More Telugu News