G.O.23: ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల జీవోను 10 రోజుల పాటు సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

AP High Court suspentds inter online admissions government order for ten days
  • ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం జీవో 23 తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • జీవోకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్లు
  • నవంబరు 10కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ సర్కారు ఇంటర్ లో అన్ లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు జీవో 23 తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు ఆప్షన్లు లేకుండా ప్రభుత్వమే కాలేజీలు కేటాయించడంపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల జీవోను 10 రోజులపాటు రద్దు చేసింది. తదుపరి విచారణ నవంబరు 10కి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా.... విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనేది వారి ఇష్టానికే వదిలేయాలని, ప్రభుత్వమే కాలేజీలు కేటాయించడం ఏంటని పిటిషన్ దారులు తమ అభిప్రాయాలను కోర్టుకు తెలిపారు. కాలేజీల్లో చేరికపై విద్యార్థులకు చాయిస్ ఉండాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థులు ఏ కాలేజీలో ఏ కోర్సు తీసుకోవాలి అనే అంశంలో ఒత్తిడికి గురవుతారని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే అవకాశముందని అన్నారు. పైగా ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని వివరించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.... ఏ నిబంధనల ఆధారంగా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించాలనుకుంటున్నారని రాష్ట్ర విద్యాశాఖను అడిగింది. విద్యార్థుల భవిష్యత్ కు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు వద్దని జస్టిస్ ఎం.వెంకటరమణ పేర్కొన్నారు.
G.O.23
Inter Online Admissions
AP High Court
Andhra Pradesh

More Telugu News