Mumbai: బట్టతలను కప్పిపెట్టి పెళ్లి.. భర్త, అత్తమామలపై చీటింగ్ కేసు పెట్టిన భార్య

Mumbai man hides his baldness for marriage wife files case
  • సెప్టెంబరులో వివాహం
  • తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు
  • అత్తమామలకు ముందస్తు బెయిల్.. భర్త అరెస్ట్‌కు రంగం సిద్ధం
భర్త తన బట్టతలను దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. భర్తతోపాటు అత్తమామలపై కేసు పెట్టింది. ఈ కేసులో అత్తమామలకు ముందస్తు బెయిలు లభించగా, భర్తకు మాత్రం చుక్కెదురైంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మీరా రోడ్డుకు చెందిన 29 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్‌ ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల యువతిని పెళ్లాడాడు. అయితే, పెళ్లయ్యాక భార్యకు అసలు విషయం తెలిసింది. పెళ్లి చూపుల్లోను, పెళ్లిలోనూ అతడు విగ్ ధరించినట్టు గుర్తించి తట్టుకోలేకపోయింది.

ఇదే విషయాన్ని అత్తమామల వద్ద నిలదీసింది. తననెందుకు మోసం చేశారని ప్రశ్నించింది. అనంతరం నేరుగా నయానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త, అత్తమామలపై చీటింగ్ కేసు పెట్టింది. అంతేకాదు, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, భర్త తనను అనుమానిస్తున్నాడని పేర్కొంది. తన ఫోన్‌ను హ్యాక్ చేసి మెసేజ్‌లు, కాల్స్ పరిశీలిస్తున్నాడని పేర్కొన్న బాధితురాలు.. తనతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని ఆరోపించింది.  

బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అత్తమామలు ముందస్తు బెయిలు తెచ్చుకున్నారని, ఆమె భర్త పిటిషన్‌ను మాత్రం కోర్టు కొట్టివేసిందని పోలీసులు తెలిపారు. నేడో, రేపు అతడిని అరెస్ట్ చేస్తామన్నారు.
Mumbai
bald hair
husband
wife
police case

More Telugu News