Narendra Modi: నాకు బీహారీల ఆశీర్వాదం కావాలి: నరేంద్ర మోదీ

  • బీహార్ లో ముగిసిన తొలి దశ ఎన్నికలు
  • రెండో దశ పోలింగ్ కు ముందు మోదీ ర్యాలీలు
  • నేడు నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు
Modi Seeks Blessings of Bihar People

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ, ఒకేరోజున నాలుగు ర్యాలీలను నిర్వహించారు. మూడు దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే ఒక దశ ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ర్యాలీల్లో మాట్లాడిన నరేంద్ర మోదీ, తనకు బీహారీల ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి మోదీ ఓ ట్వీట్ పెట్టారు.

"రేపు నేను బీహార్ ప్రజల మధ్యలో ఉంటాను. అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ జరగనున్న వేళ, నాకు ప్రజల ఆశీర్వాదం కావాలి. చాప్రా, సమస్తిపూర్, మోతీహారీ, బగాహ ప్రాంతాల్లో నేను సమావేశాలను నిర్వహించనున్నాను" అని మోదీ తెలిపారు. రెండో దశ ఎన్నికలకు సమయం సిద్ధమైన వేళ, ఎన్డీయే - బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరేందుకు మోదీ విస్తృతంగా పర్యటించనున్నారు.

కాగా, ఈ కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ తరఫున గడచిన 40 ఏళ్లలో తొలిసారిగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేయడం లేదు. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, అవినీతి కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, మహా కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు భాగస్వామ్యం అయ్యాయి.

తన ప్రచారంలో భాగంగా తేజస్వి ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తేజస్వి సభలకు భారీగా తరలివస్తున్న ప్రజలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు, తీర్పు ఎలా ఉంటుందన్న విషయమై ఓ అంచనాకు రాలేకపోతుండటం గమనార్హం.

More Telugu News