Nayini: నాయిని మరణం విచారకరం: చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • నాయిని మరణం కార్మిక లోకానికి తీరని లోటు అన్న చంద్రబాబు
  • నిబద్ధత కలిగిన ఉద్యమకారుడన్న పవన్ కల్యాణ్
  • ప్రజలకు అమూల్యమైన సేవలను అందించారని వ్యాఖ్య
Chandrababu and Pawan Kalyan pays tributes to Nayini

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'తెలంగాణ రాష్ట్ర తొలి హోమ్ శాఖామంత్రి, జీవితాంతం కార్మిక లోకానికి అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డిగారి మరణం విచారకరం. కార్మిక లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కార్మిక నాయకుడు, తెలంగాణవాది నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణవాసులకు తీరని లోటని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు నాయిని అని కొనియాడారు. తొలి, మలి దశ ఉద్యమాలలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. కార్మిక నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ప్రజలకు అమూల్యమైన సేవలను అందించారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంత్రిగా ఆయన ప్రజలకు సేవలందించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News