Brahmos: గురితప్పని బ్రహ్మోస్... తాజా ప్రయోగం విజయవంతం

Brahmos missile successfully hits the target in Arabian Sea
  • యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం
  • అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించిన బ్రహ్మోస్
  • డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్ నాథ్ సింగ్
భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అనదగ్గ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం మరోమారు విజయవంతమైంది. ఈసారి బ్రహ్మోస్ క్షిపణిని భారత నేవీకి చెందిన స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) వెల్లడించింది.

ఈ ప్రయోగం ఆసాంతం బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని, గాల్లోకి లేచింది మొదలు లక్ష్యాన్ని తాకే వరకు అన్ని దశల్లోనూ ఇది సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రహ్మోస్ తాజా వెర్షన్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై భారత యుద్ధనౌకలు కూడా శత్రు భీకర వేదికలు కానున్నాయి.

తాజా ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి కూడా తమ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్ల నుంచి బ్రహ్మోస్ పేరు ఉద్భవించింది.
Brahmos
Supersonic
Cruise Missile
Navy
Stelth Destroyer
INS Chennai
DRDO
India

More Telugu News