Kannababu: బికినీ పండుగ నిర్వహించుకోవడానికే మీకు విశాఖ కనిపించిందా?: కన్నబాబు

Chandrababu doent like Vizag says Kannababu
  • చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కన్నబాబు
  • అమరావతిపై ఉన్న ప్రేమలో విశాఖపై ఒక శాతం ప్రేమ కూడా లేదు
  • కమిటీల నివేదికల ఆధారంగానే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక్కశాతం కూడా విశాఖపై లేదని మంత్రి కన్నబాబు విమర్శించారు. సమ్మిట్లు పెట్టుకోవడానికి, బికినీల పండుగను నిర్వహించుకోవడానికి మాత్రమే మీకు విశాఖ కనిపించిందా? అని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు సమ్మిట్లు పెట్టుకోలేదని అడిగారు.

కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో కూడా మూడు రాజధానులపై తీర్మానం చేశామని తెలిపారు. అయితే మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి అనే సినిమాకు మూడో శతదినోత్సవాన్ని చంద్రబాబు చేశారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఎన్ని శతదినోత్సవాలు జరిపినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. తమ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే సీపీఐ నేతలు అదే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి సీపీఐ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై నమ్మకం లేక కలిసి పోటీ చేయలేదా? అని అడిగారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నేతలు అంటున్నారని... మళ్లీ ఎన్నికలకు వెళ్తే సీపీఐకి ఏమైనా 100 సీట్లు వస్తాయా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం తమదని... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ తమదే అధికారమని చెప్పారు.
Kannababu
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News