Dronamraju Srinivas: నాన్న ఆరోగ్యంపై జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు: ద్రోణంరాజు శ్రీవాత్సవ

Jagans love is pure says Dronamraju Srivatsava
  • ద్రోణంరాజు శ్రీనివాస్ సంస్మరణ సభను నిర్వహించిన వైసీపీ
  • జగన్ ప్రేమ స్వచ్ఛమైనదన్న శ్రీనివాస్ కుమారుడు
  • ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్న విజయసాయి
మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన సంస్మరణ సభను ఈరోజు నిర్వహించారు. విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్ లో జరిగిన ఈ సభకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, సత్యవతిలతో పాటు ద్రోణంరాజు కుమారుడు శ్రీవాత్సవ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడుతూ, తమ కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారని చెప్పారు. నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు జగన్ ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని జగన్ ఆదేశించారని... దురదృష్టవశాత్తు నాన్న చనిపోయారని అన్నారు. జగన్ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. వైసీపీలోకి నాన్న ఆలస్యంగా చేరినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రజా నాయకుడని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. చివరిసారిగా శ్రీనివాస్ తనకు ఫోన్ చేసి శ్రీవాత్సవను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. తండ్రిబాటలోనే శ్రీవాత్సవ నడవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Dronamraju Srinivas
Jagan
Vijayasai Reddy
YSRCP

More Telugu News