Cyber Crime: 'మీరంటే ఇష్టం... హైదరాబాద్ రావాలని ఉంది!' అంటూ అమ్మాయిల పేరిట డాక్టర్ ను బుట్టలో వేసిన సైబర్ నేరగాళ్లు!

Cyber criminals duped a doctor after lured him with girls
  • డాక్టర్ నెంబర్ కి అమ్మాయిలతో ఫోన్ చేయించిన నేరగాళ్లు 
  • వీడియో కాల్ ద్వారా ముచ్చట్లు
  • తమ వలలో చిక్కుకున్నాడని తెలుసుకుని ప్లాన్ అమలు
పెరుగుతున్న సాంకేతిక విస్తృతి, సోషల్ మీడియా వినియోగం సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ కు అమ్మాయిల పేరిట వల విసిరిన మోసగాళ్లు రూ.41 లక్షలు గుంజేశారు. ఏకంగా ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడించి ఆ వైద్యుడ్ని తమ బుట్టలో వేసుకున్నారు. ప్రతి రోజు రాత్రివేళల్లో అమ్మాయిలతో మాట్లాడిస్తూ ఆయన తమ దారిలోకి వచ్చాడని నిర్ధారించుకున్న పిమ్మట తమ ప్లాన్ అమలు చేశారు.

తాము ఓ స్కీమ్ మొదలుపెట్టామని, అందులో నగదు డిపాజిట్ చేస్తే కొంతకాలం తర్వాత వడ్డీతో కలిపి అసలు ఇస్తామని నమ్మబలికారు. ఆయనతో మూడు నెలల్లో అనేక దఫాలుగా లక్షల రూపాయలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. మీరంటే ఎంతో ఇష్టం, మీకోసం హైదరాబాద్ రావాలని ఉంది అంటూ ఆ అమ్మాయిలు వీడియో కాల్ లో తీయగా చెబుతుండడంతో ఆ డాక్టర్ మరేమీ ఆలోచించకుండా డబ్బు పంపారు.

అయితే ఎంతకీ వడ్డీ, అసలు రాకపోవడంతో డాక్టర్ కు సందేహం కలిగింది. అవతలి వ్యక్తులకు ఫోన్ చేయగా, అట్నుంచి స్పందన కరవైంది. దాంతో మోసపోయానని గ్రహించి లబోదిబోమన్న ఆ హైదరాబాద్ వైద్యుడు చేసేదిలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Crime
Doctor
Hyderabad
Cheating
Police

More Telugu News