China: ఒక్క రిపోర్టును తొలగించిన చైనా... ప్రతీకారంగా 2017 నుంచి అన్ని నివేదికలను డిలీట్ చేసిన భారత్!

India Removed All reports amid China Delete One Report
  • 2017 డోక్లామ్ నివేదికలు కూడా తీసేసిన భారత్
  • అధికారికంగా స్పందించని రక్షణ శాఖ
  • తిరిగి అందుబాటులోకి తెస్తామన్న కార్యాలయ వర్గాలు
లడఖ్ లో జరుగుతున్న పరిణామాలపై ఏకపక్ష దూకుడును ప్రదర్శిస్తూ, నెలవారీ నివేదికను చైనా తొలగించిన నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2017 నుంచి ఉన్న అన్ని నెలవారీ నివేదికలను రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఈ రిపోర్టుల్లో 2017లో డోక్లామ్ లో జరిగిన వివాదానికి సంబంధించిన నివేదికలు కూడా ఉండటం గమనార్హం.

వాస్తవానికి సరిహద్దుల్లో పరిస్థితిపై ఇరు దేశాలూ, ప్రతి నెలా రిపోర్టులను విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో నెలకొన్న పరిణామాలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచిన నేపథ్యంలో చైనా తన నివేదికలను తొలగించగా, భారత్ సైతం దీటుగా స్పందించింది. ఇక ఈ విషయంలో మీడియా ప్రతినిధులు రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించగా, అధికారులు స్పందించలేదు. అయితే, అక్టోబర్ ముగిసేలోగా, తిరిగి రిపోర్టులను అందుబాటులో ఉంచుతామని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలోని అన్ని విభాగాల్లోనూ మరింత పారదర్శకతను పెంచేలా రిపోర్టులను సమగ్రంగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఒకసారి తయారైన రిపోర్టులు ప్రజల ముందుకు వచ్చే ముందు సీనియర్ ఆఫీసర్లు వాటిని పరిశీలిస్తారు. కొన్ని పెద్ద పెద్ద ఘటనలకు సంబంధించిన నివేదికలు మాత్రం బహిర్గతం కాబోవు. ఉదాహరణకు బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్, ఇండియా - పాకిస్థాన్ డాగ్ ఫైట్ తదితరాలపై ఎలాంటి సమాచారాన్ని రక్షణ శాఖ వెలువరించదు.
China
India
Reports
Delete

More Telugu News