Jagan: మూలానక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

CM Jagan will be offered sacred clothing to Kanakadurga
  • ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు
  • సమావేశమైన దుర్గ గుడి పాలకమండలి
  • ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారికే దర్శనం
త్వరలో జరిగే దసరా ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబవుతోంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు కనకదుర్గ గుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు వెల్లడించారు.

దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశంలో చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో సురేశ్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్నాయి.  కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకు 10 వేల నుంచి 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించి, టైమ్ స్లాట్ విధానం ద్వారా రద్దీ లేకుండా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. భౌతికదూరం నిబంధన నేపథ్యంలో టోల్ గేట్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా కొత్త క్యూలైన్లు నిర్మించాలని నిర్ణయించారు.

దీనిపై ఆలయ ఈవో సురేశ్ బాబు మాట్లాడుతూ, పాలకమండలి సమావేశంలో మొత్తం 37 అంశాలపై చర్చించామని, అమ్మవారి దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. కాగా, పాలకమండలి సమావేశం సందర్భంగా దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
Jagan
Kanakadurga Temple
Dussehra
Navaratri

More Telugu News