Jagan: ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్‌

jagan meeys with modi
  • ఢిల్లీ పర్యటనలో జగన్
  • జగన్‌ వెంట పలువురు వైసీపీ ఎంపీలు 
  • ఎన్డీఏలో చేరనున్నట్లు ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై ఆయన మాట్లాడతారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు 17 అంశాలపై మోదీకి జగన్‌ నివేదించనున్నట్లు తెలిసింది.

కాసేపట్లో జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ లో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి పరిష్కరించాల్సిన జల వివాదాలపై కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా, ముఖ్యమంత్రి జగన్‌ వెంట పలువురు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు. మరోపక్క, ఎన్డీఏలో చేరాల్సిందిగా వైసీపీకి ఆహ్వానం అందిందని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి పదవులను వైసీపీకి మోదీ ఆఫర్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మోదీతో జగన్ సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది.
Jagan
Narendra Modi
NDA
YSRCP

More Telugu News