West Godavari District: పశ్చిమ గోదావరిలో దారుణం.. రూ. 30 వేల బాకీ తీర్చలేదని స్నేహితుడికి శిరోముండనం

Man tonsure his friend for not to pay his loan back
  • జంగారెడ్డిగూడెంలో ఘటన
  • స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో బంధించి, ఆ పై శిరోముండనం
  • నలుగురు నిందితుల అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో స్నేహితుడని కూడా చూడకుండా శిరోముండనం చేయించాడో వ్యక్తి. విషయం పోలీసులకు చేరడంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అలకా అభిలాష్, జంగారెడ్డిగూడేనికి చెందిన ఎర్రసాని విజయ్‌బాబు స్నేహితులు. అభిలాష్ ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తుండగా, విజయ్‌బాబు మునిసిపల్ ఉద్యోగి.

కొంతకాలం క్రితం అభిలాష్ తన స్నేహితుడైన విజయ్‌బాబు వద్ద అవసరాల నిమిత్తం రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ ఇటీవల అభిలాష్‌కు ఫోన్ చేసిన విజయ్‌బాబు పరుష పదజాలంతో దూషించాడు. అనంతరం బాకీ వసూలు కోసం తన మిత్రులు కంకిరెడ్డి మార్కండేయులు, షేక్ నాగూర్ మీరావలితో కలిసి శనివారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లి బాకీ తీర్చాలంటూ అభిలాష్‌ను పట్టుబట్టారు. ఇప్పటికిప్పుడంటే తన వద్ద డబ్బులు లేవని సమయం ఇవ్వాలని కోరాడు.

దీంతో అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని జంగారెడ్డిగూడెం తీసుకెళ్లారు. అక్కడ బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలోని ఓ ఇంట్లో బంధించారు. నిన్న ఉదయం మణికంఠ అనే యువకుడిని పిలిపించి అభిలాష్‌కు శిరోముండనం చేయించి జంగారెడ్డి గూడెం బస్టాండ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అభిలాష్ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు.
West Godavari District
Jangareddy gudem
Tonsure
Andhra Pradesh

More Telugu News