New Caledonia: మాకు స్వాతంత్ర్యం వద్దంటే వద్దంటున్న దీవి ఇదే!

  • న్యూ కలెడోనియా దీవిలో రిఫరెండం నిర్వహణ
  • తాము ఫ్రెంచ్ పాలనలోనే ఉంటామని అత్యధికుల వెల్లడి
  • తమకు స్వాతంత్ర్యం అక్కర్లేదని స్పష్టీకరణ
New Caledonia opts to remain with France

భారతదేశం బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందడానికి ఎంతో ప్రాణనష్టం జరిగింది. కొన్ని తరాలు స్వాతంత్ర్య వీచికలను ఆస్వాదించకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. భారత్ మాత్రమే కాదు, అనేక దేశాలు స్వతంత్ర భావన కోసం తీవ్రంగా పోరాడాయి. కానీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉండే న్యూ కలెడోనియా అనే దీవి మాత్రం తమకు స్వాతంత్ర్యం వద్దంటే వద్దంటోంది.

ఇది ఫ్రెంచ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న దీవి. ఇటీవలే స్వాతంత్ర్యం అంశంపై రిఫరెండం నిర్వహించగా, అత్యధికులు వ్యతిరేకంగా ఓటేశారు. ఫ్రాన్స్ నుంచి తాము స్వాతంత్ర్యం కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. తాము ఫ్రెంచ్ పాలనలోనే ఉంటామని 53.26 శాతం మంది రిఫరెండంలో వెల్లడించారు. తాజా రిఫరెండంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు జీన్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పందిస్తూ, తమ గణతంత్ర వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. న్యూ కలెడోనియా ప్రజల నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఈ న్యూ కలెడోనియా దీవి 170 ఏళ్లుగా ఫ్రాన్స్ ఏలుబడిలో ఉంది. ఇక్కడ ఎక్కువగా స్థానిక కనాక్ ప్రజలతో పాటు యూరోపియన్ సెటిలర్ల వారసులు నివాసం ఉంటున్నారు. జనాభా మొత్తంలో కనాక్ లు 40 శాతం ఉంటారు. కాగా, న్యూ కలెడోనియాలో నికెల్ లోహం నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ లోహం ఎలక్ట్రానిక్స్ లో అత్యధికంగా వినియోగిస్తారు. ఫ్రాన్స్ ఈ దీవిని రాజకీయ వ్యూహాత్మక, ఆర్థిక వనరుగా భావిస్తోంది.

న్యూ కలెడోనియా ఫ్రెంచ్ అధిపత్యంలో ఉన్నా విస్తృతస్థాయిలో స్వయంప్రతిపత్తిని అనుభవిస్తోంది. అయితే రక్షణ, విద్యా రంగాల్లో ఎక్కువగా ఫ్రాన్స్ పైనే ఆధారపడుతుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి అత్యధిక మొత్తంలో రాయితీలు పొందుతోంది.

More Telugu News