Sabbam Hari: నేను ఆ రెండు పదాలు వాడడం తప్పే... సర్దుకునే సరికే లైవ్ లోకి వెళ్లాయి: సబ్బం హరి
- గోడ కూల్చివేతపై సబ్బం హరి ఆగ్రహం
- సబ్బం హరి వ్యాఖ్యలపై వైసీపీ నేతల మండిపాటు
- మన్నించాలని కోరిన సబ్బం హరి
తన ఇంటి ప్రహరీగోడను అక్రమ నిర్మాణం పేరిట అధికారులు కూల్చివేయడంపై టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఘాటైన పదజాలంతో విమర్శించారు. అయితే ఆయన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో సబ్బం హరి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను గత మీడియా సమావేశంలో 'వాడు, 'రాస్కెల్' అనే పదాలు వాడానని, ఆ పదాలు మాట్లాడినందుకు తనకే చాలా బాధ కలిగిందని సబ్బం హరి విచారం వ్యక్తం చేశారు.
సాధారణంగా తాను 'వాడు' అనే పదాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటానని, అయితే ఆ పదం వచ్చినవెంటనే సర్దుకుని ఆయన అంటూ కొనసాగిస్తుంటానని వివరించారు. కానీ ఈసారి తాను అన్న పదాలను సర్దుకునే లోపే అవి లైవ్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.
"నేనన్న ఆ చిన్న మాటను పట్టుకుని వాడు, వాడి ప్రభుత్వం అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రసారం చేశారు. నేనన్న మాటతో ఎవరి మనసైనా బాధపడడం సహజం. నేను కూడా అందరిలాగా సాధారణమైన వ్యక్తినే. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. తెల్లవారు జామున వందల సంఖ్యలో పోలీసులతో నా ఇంటికి వచ్చి కూలగొట్టారు. ఎవరో మామూలు వ్యక్తితో వ్యవహరించినట్టు నాతో వ్యవహరించారు. నాతో చెప్పి ఉంటే నేనే తొలగించి ఉండేవాడ్ని.
ఈ మాత్రం దానికి ఇంత హంగామా చేశారన్నదే నాకు బాధ కలిగించింది. ఆ కోపంలో రెండు మాటలు వాడాను తప్ప మరో ఉద్దేశంలేదు. అందుకే నా మాటల పట్ల మన్నించమని వారిని కోరుతున్నాను. ముఖ్యమంత్రి అభిమానులకు కూడా ఇదే చెబుతాను. అయితే ఈ మాటలు ఎవరికో భయపడో, జడుసుకునో చెప్పడంలేదు. ప్రజల తరఫున మాట్లాడే సబ్బం హరి ఎలా మాట్లాడతాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. అందులో ఎలాంటి తేడా లేదు, అందులో కోటి వంతు కూడా నేను తగ్గను, నా భావవ్యక్తీకరణలో మార్పు ఉండదు" అని సబ్బం హరి స్పష్టం చేశారు.