Pattabhiram: నిన్న సబ్బం హరికి ఓ బహుమానం ఇచ్చారు, ఇవాళ నాక్కూడా ఇచ్చారు: పట్టాభి

TDP leader Pattabhirami gets anger after his car was demolished by goons
  • పట్టాభిరామ్ కారు ధ్వంసం
  • పిరికిపందలు, దద్దమ్మలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పట్టాభి
  • ఈ దాడితో తనలో మరింత పట్టుదల పెరిగిందని వెల్లడి
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విధ్వంసానికి పాల్పడడం తెలిసిందే. దీనిపై పట్టాభిరామ్ స్పందించారు. ఇలాంటి దాడులతో తనను భయభ్రాంతులకు గురిచేసి, తన నోరు మూయించాలని చూస్తే తాను భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కారును ధ్వంసం చేసినంత మాత్రాన వెనుకంజ వేసే పిరికివాడ్ని కాదని అన్నారు. తన ఇంటి పక్కనే హైకోర్టు జడ్జి ఇల్లు ఉందని, అక్కడ పోలీసు బందోబస్తు ఉన్నాగానీ తన నివాసం వద్ద కారు ధ్వంసం చేశారని పట్టాభి వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను తాను అదేపనిగా ప్రశ్నిస్తుండడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం నిన్న విశాఖలో సబ్బం హరికి ఓ బహుమానం ఇచ్చిందని, ఇవాళ విజయవాడలో తనకు కూడా ఇచ్చారని వ్యంగ్యం ప్రదర్శించారు. కొందరు పిరికిపందలు, దద్దమ్మలను తన ఇంటిపైకి దాడికి పంపిస్తే తాను మౌనం దాల్చుతానని సీఎం జగన్ భ్రమపడుతున్నారని, నీతి నిజాయతీగా బతుకుతున్న తాను ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరిపోనని పట్టాభి ఉద్ఘాటించారు.

ఈ దాడితో మరింత గట్టిగా తన గళం వినిపించాలన్న పట్టుదల ఇంకా పెరిగిందని వెల్లడించారు. తనలో పట్టుదల పెరిగితే ఫలితం ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారని పట్టాభిరామ్ హెచ్చరించారు.
Pattabhiram
Car
Demolition
Telugudesam
Jagan
YSRCP

More Telugu News