Donald Trump: ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం... మరో 48 గంటలు అత్యంత కీలకం!

Donald Trump Health Criticle
  • వైరస్ సోకిన తరువాత ముఖ్య అవయవాలు ప్రభావితం
  • స్థూలకాయం, కొలెస్ట్రాల్  ప్రధాన సమస్య
  • రెండు రోజుల తరువాతే పరిస్థితిపై అవగాహన
  • వెల్లడించిన ట్రంప్ సన్నిహిత వర్గాలు
కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రానున్న 48 గంటలూ అత్యంత కీలకమని ఆయన సన్నిహితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కరోనా వైరస్ సోకిన తరువాత, 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమైన అవయవాలు ప్రభావితం అయ్యాయని, ఇది కలవర పెట్టే అంశమని వైట్ హౌస్ కు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో, ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగింది.

కాగా, తొలుత వైట్ హౌస్ లోనే చికిత్స పొందాలని ట్రంప్ భావించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు దృష్ట్యా, ప్రత్యేక హెలికాప్టర్ లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, డిశ్చార్జ్ కావడానికి మరింత సమయం పడుతుందని, రెండు రోజుల తరువాతే ఆయన ఆరోగ్యంపై ఓ అవగాహనకు రావచ్చని తెలుస్తోంది.

ట్రంప్ ఇప్పటికే స్థూలకాయం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటంతో చికిత్స విషయంలో వైద్యులు కలవరపడుతున్నట్టు సమాచారం. ఆసుపత్రిలోనే తాత్కాలిక అధ్యక్ష కార్యాలయం ఏర్పడిందని, అక్కడి నుంచే కొంతకాలం పాటు ట్రంప్ విధులు నిర్వహిస్తారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక మెలానియా ట్రంప్ కు స్వల్పంగా దగ్గు మాత్రమే ఉందని, ఆమె త్వరగానే కోలుకుంటారని వైద్య వర్గాలు వెల్లడించారు. వైట్ హౌస్ కువెళ్లిన ముగ్గురు మీడియా ఉద్యోగులకు, ఇద్దరు సెనెటర్లకు, ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ కు, మాజీ సలహాదారుడికి కూడా కరోనా సోకగా, వారందరికీ ఇప్పుడు చికిత్స జరుగుతోంది.
Donald Trump
Corona Virus
Walter Reed Hospital

More Telugu News