Hathras: రెండు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన హత్రాస్ మృతురాలి కుటుంబసభ్యులు.. సంచలన విషయాలు వెల్లడి! 

Hathras Victims Family Speaks To Media After 2 Days
  • ఆరోజు దహనం చేసిన శరీరం ఎవరిది?
  • పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదు
  • కేసు సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు
తమ బిడ్డను అత్యంత దారుణంగా చంపేశారని ఆమెకు న్యాయం జరగాలని హత్రాస్ మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. మృతురాలి శరీరాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేసిన రెండు రోజుల తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో, మృతురాలి సోదరుడు మాట్లాడుతూ... ఆరోజు దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే... ఆ విధంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు.

తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని మండిపడ్డాడు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఇవ్వాలని అడిగితే... అది ఇంగ్లీషులో ఉంటుందని, మీకు అర్థం కాదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమను ఇంటి నుంచి కదిలేందుకు కూడా అనుమతించడం లేదని చెప్పాడు.

తాము ఎంతో భయానికి గురవుతున్నామని అన్నాడు. తమకు కొంత ఏకాంతం కావాలని పోలీసులను కోరుతున్నామని చెప్పాడు. పోలీసులు రోజంతా తమ ఇంటిలోనే ఉంటున్నారని తెలిపాడు. అధికారులు తమ ఇంటికి వచ్చినప్పుడల్లా ఫోన్ చూపించాలి అంటున్నారని... బయటి ప్రపంచంతో మాట్లాడేందుకు తమకు ఉన్న ఒకే ఒక దారి ఫోనే అని చెప్పాడు.

మరో కుటుంబసభ్యుడు మాట్లాడుతూ, గ్రామ అధికారి సమక్షంలో కేసును సెటిల్ చేసుకోవాలంటూ తమను ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా తమకు న్యాయం జరగాల్సిందేనని చెప్పాడు.
Hathras
Victim Family
Media

More Telugu News