Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డి కుమార్తెనంటూ... సినీ ఫక్కీలో మోసం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన కిలేడీ!
- జనార్దన్ రెడ్డి మామ ఇంటికి ఓ యువతి
- తనను పుట్టగానే నర్సు తీసుకెళ్లిందని కట్టుకథ
- నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తెనని చెప్పుకున్న ఓ యువతి సినీ ఫక్కీలో వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి వెల్లడించిన వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి మామయ్య దేరెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఇంటికి గత నెల 25న ఓ యువతి వచ్చింది. తాను జనార్దన్ రెడ్డి భార్యకు జన్మించిన యువతినని నమ్మబలికింది.
28 సంవత్సరాల క్రితం అనంతపురంలోని ఆసుపత్రిలో ఆయన భార్య కవలలను ప్రసవించిందని, ఓ బిడ్డను నర్సు అపహరించి, కొన్ని రోజుల తరువాత వేరే మహిళకు అప్పగించిందని, ఆ యువతిని తానేనని చెప్పింది. అందుకు సాక్ష్యంగా కొన్ని మార్ఫింగ్ చిత్రాలను పరమేశ్వర్ రెడ్డి ముందు ఉంచింది. తాను కూడా మీకు మనవరాలినేనని, ఆ విషయాన్ని ఒప్పుకోకుంటే పది మంది ముందూ పరువు తీస్తానని హెచ్చరించింది. తనకు వెంటనే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై పరమేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, వారి బాగోతాన్ని బయట పెట్టారు. హైదరాబాద్, లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సంగీతా రెడ్డి అలియాస్ గంగ, ఆమె భర్త నజీర్, వారి కారు డ్రైవర్ శ్రీమన్నారాయణ, అతని భార్య లక్ష్మి కలసి ఓ ముఠాగా ఏర్పడి ఈ ప్లాన్ వేశారని తేల్చారు. ఆపై వారిని నిన్న అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కారు, మార్ఫింగ్ చేసిన ఫొటోలను స్వాధీనం చేసుకున్నామని, కేసు తదుపరి విచారణ జరుగుతోందని చిదానంద రెడ్డి వెల్లడించారు.