Mumbai Indians: రోహిత్, పొలార్డ్, పాండ్య మెరుపులు... ముంబయి భారీ స్కోరు

Mumbai posts huge total after Rohit and Pollard blasts
  • మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 రన్స్
  • 70 పరుగులు చేసిన రోహిత్ శర్మ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (0) డకౌట్ అయినా, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి 70 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 45 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ ఐపీఎల్ లో 5,000 పరుగుల మైలురాయి దాటాడు.

ఇక, మిడిలార్డర్ లో కీరన్ పొలార్డ్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో చకచకా 47 పరుగులు సాధించగా, చిచ్చరపిడుగు హార్దిక్ పాండ్యా తన స్థాయికి తగినట్టుగా ఆడుతూ 11 బంతులలో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 30 పరుగులు పిండుకున్నాడు. యువ కెరటం ఇషాన్ కిషన్ 28 పరుగులు నమోదు చేశాడు. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్ తలో వికెట్ తీశారు.

లక్ష్యఛేదనను పంజాబ్ జట్టు ధాటిగా ప్రారంభించినా... కీలకమైన మయాంక్ (25) వికెట్ ను ఆరంభంలోనే కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 12, కరుణ్ నాయర్ (0) పరుగులతో ఆడుతున్నారు.
Mumbai Indians
Rohit Sharma
Pollard
Pandya
Kings XI Punjab
IPL 2020

More Telugu News