Anantapur District: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్.. యువతి ఆత్మహత్యాయత్నం

Young girl commits suicide in tadipatri after constable rejected to marry her
  • అనంతపురంలోని తాడిపత్రిలో ఘటన
  • పెళ్లి చూపుల అనంతరం వద్దనుకున్న కుటుంబ సభ్యులు
  • ప్రేమిస్తున్నట్టు చెప్పి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన కానిస్టేబుల్
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన కానిస్టేబుల్ ఆ తర్వాత మోసం చేయడంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిందీ ఘటన. రాప్తాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఆరు నెలల క్రితం తాడిపత్రికి చెందిన కానిస్టేబుల్‌తో పెళ్లి చూపులు జరిగాయి. ఇరు కుటుంబాల వారికి నచ్చకపోవడంతో సంబంధం వద్దనుకున్నారు. సదరు కానిస్టేబుల్ మాత్రం యువతిని ప్రేమిస్తున్నానని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

అయితే, ఇటీవల కానిస్టేబుల్ మాట మార్చి పెళ్లి చేసుకోనని చెప్పడంతో విస్తుపోయిన యువతి అతడితో మాట్లాడేందుకు నిన్న తాడిపత్రి వెళ్లింది. అయినప్పటికీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు కానిస్టేబుల్ అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన యువతి బస్టాండ్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుప్పకూలిన ఆమెను గమనించిన ప్రయాణికులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి అనంతపురం తరలించారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Anantapur District
tadipatri
Constable
Love
Suicide

More Telugu News