jaswanth singh: బీజేపీ సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

jaswanth singh passes away
  • ఐదేళ్ల క్రితం బాత్‌రూంలో జారిపడి మెదడుకి గాయాలు
  • అప్పటి నుంచి కోమాలో ఉన్న నేత
  • వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జశ్వంత్
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ (82) కన్నుమూశారు. వాజ్‌పేయీ హయాంలో ఆయన రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా కొనసాగారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఓ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని మోదీ అన్నారు.

కాగా, జశ్వంత్‌ సింగ్‌ సొంత ప్రాంతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. ఆయన‌ 1950లో ఆర్మీలో చేరి, ఆర్మీ అధికారిగా సేవలందించారు.  బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 1980 నుంచి 2014 మధ్య కాలంలో పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయితే, 2014లో పార్టీ అదేశాలకు విరుద్ధంగా రాజస్థాన్ బార్మర్ లోక్‌సభ స్థానానికి పోటీలో నిలిచినందుకు బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఇంట్లోని బాత్‌ రూమ్‌లో జారిపడడంతో మెదడుకి గాయాలై కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు ఐదేళ్ల పాటు ఆయన కోమాలో ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

jaswanth singh
BJP
New Delhi

More Telugu News