KCR: పేదరికానికి కులం, మతం లేవు... అందరికోసం పనిచేసే ప్రభుత్వం మాది: సీఎం కేసీఆర్

CM KCR reviews land issues in the wake of new acts
  • భూ సమస్యల పరిష్కారంపై సీఎం సమీక్ష
  • పేదలకు ఇబ్బంది కలగకూడదంటూ అధికారులకు దిశానిర్దేశం
  • 24 గంటలూ శ్రమించాలంటూ ఉద్బోధ
రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉండే నివాస స్థలాలే కాకుండా, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు.

మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల నివాసాలు, అపార్ట్ మెంట్ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తులు ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న చట్టాలు పది కాలాల పాటు ప్రజలకు మేలు చేయనున్నాయని, వీటి అమలులో నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక హైదరాబాద్ నగరం గురించి చెబుతూ... సుస్థిర పాలన వల్ల భూ తగాదాలు, కబ్జాలు, వేధింపులు, గూండాగిరీ తగ్గి... గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసిందని తెలిపారు. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో స్ధిరపడ్డారని, తమ భవనాలు, ఆలయాలను నిర్మించుకుని తమ సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారని వివరించారు. అటు, తెలంగాణ రాకముందు కరవుతో అల్లాడిన గ్రామీణ ప్రజలు కూడా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారని పేర్కొన్నారు.

నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లోనూ ఉన్నారని, పేదరికానికి కులం, మతం లేవని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపనార్థాలు పెట్టారని, కానీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయని చెప్పారు. రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వస్తోందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన చట్టాలు తీసుకువస్తోందని, అయితే ఈ చట్టాల అమలుతో ఏ ఒక్క నిరుపేదకు ఇబ్బంది కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాలని పిలుపునిచ్చారు.
KCR
Review
Lands
TRS
Hyderabad
Telangana

More Telugu News