Kodali Nani: ఎలాంటి సమాచారం లేకుండానే తిరుమల చేరుకున్న కొడాలి నాని.. మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు!

Kodali Nani reaches Tirumala without intimation
  • వెంకన్న ఆశీస్సులతోనే జగన్ సీఎం అయ్యారన్న కొడాలి నాని
  • డిక్లరేషన్ పై సంతకంపై చర్చ జరగాలని డిమాండ్
  • కొండపై చంద్రబాబు గురించి మాట్లాడనని వ్యాఖ్య
తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ పై సంతకం చేయాలనే అంశం ఏపీలో రాజకీయ రంగును పులుముకుంది. కాసేపట్లో జగన్ తిరుమలకు చేరుకోనున్న తరుణంలో ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డిక్లరేషన్ పై సంతకం అవసరం లేదంటూ వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోసిన మంత్ర కొడాలి నాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనదైన స్థాయిలో విపక్షాలపై నిప్పులు చెరిగారు.

తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే జగన్ సీఎం అయ్యారని నాని చెప్పారు. సీఎం హోదాలోనే ఆయన తిరుమలకు వస్తున్నారని, స్వామికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని అన్నారు. డిక్లరేషన్ పై సంతకం చేయాలనే నిబంధనను రాజులు పెట్టారా? బ్రిటీష్ వాళ్లు తీసుకొచ్చారా? అనే విషయంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నమ్మకం లేకుండా ఏ వ్యక్తి కూడా ఏడు కొండలు ఎక్కి రారని అన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రపంచంలోని అందరికీ దేవుడేనని చెప్పారు. వెంకన్నను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు.

చర్చిలో కీర్తన పాడిన చంద్రబాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చాయని నాని ఎద్దేవా చేశారు. జగన్ కు మత పిచ్చి లేదని చెప్పారు. మతం ముసుగులో ఉన్న కొందరు హిందూ గురువులు జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం తాను తిరుమలకు వచ్చి గుండు చేయించుకుంటానని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ముందు మోదీని సతీసమేతంగా పూజలు చేయాలని చెప్పాలని... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎవరిని తీసుకెళ్లి పూజలు చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ఇస్తున్న పార్టీ తమదని... బీజేపీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు రాజకీయాలు చిన్నప్పటి నుంచి  చూస్తున్నామని నాని చెప్పారు. చంద్రబాబు గురించి కొండపై మాట్లాడనని... కిందకు వెళ్లిన తర్వాత మాట్లాడతానని అన్నారు.
Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
Tirumala

More Telugu News