India: ఐరాస సమావేశంలో కశ్మీర్‌పై పాక్ వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన భారత్‌

india slams pakistan
  • ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య కశ్మీర్ అన్న పాక్
  • పాక్‌కు నిరాధార ఆరోపణలు చేయడం అలవాటైందన్న భారత్‌
  • దేశాభివృద్ధి కోసం పాక్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని హితవు  
కశ్మీర్‌ అంశంపై  ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో పాకిస్థాన్‌ మరోసారి భారత్‌ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్‌ చర్యలను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితిలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యల్లో ఒకటిగా కశ్మీర్‌ ఉందని పాక్‌ చెప్పే ప్రయత్నాలు చేసింది.

ఐక్య రాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సభ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి తోడ్పాటునందిస్తున్నప్పటికీ ఇంకా పలు సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. జమ్మూకశ్మీర్‌, పాలస్తీనా లాంటి వివాదాలు అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. ఇందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టబోయే చర్యల కోసం వేచి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలు మాటలకే పరిమితమవుతున్నాయని ఆయన అన్నారు. అలాగే, భద్రతా మండలికి అంతర్జాతీయ సహకారం తగ్గుతోందని చెప్పారు. అనంతరం ఐరాస భారత కార్యదర్శి విదిష మైత్ర మాట్లాడుతూ పాక్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాక్‌కు నిరాధార ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయిందని చెప్పారు.

ఇటువంటి చర్యలకు పాల్పడకుండా దేశాభివృద్ధి కోసం పాక్ లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ దిశగా అడుగులు వేయాలన్నారు.  జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి భారత అంతర్గత విషయాల్లో పాక్‌ జోక్యం చేసుకుంటోందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాక్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పాక్‌ ఇలాంటి కుట్రలపై కాకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.

India
Pakistan
un

More Telugu News