Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం... ఆలయ చరిత్రలో తొలిసారిగా అంతా ఏకాంతమే!

Tirumala Brahmotsavams from Today
  • నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • గరుడోత్సవం రోజున వెళ్లనున్న ఏపీ సీఎం
  • రథోత్సవం పూర్తిగా రద్దు
తిరుమలలో అధిక ఆశ్వయుజ మాసం సందర్భంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఈ ఉత్సవాలు భక్తులు లేకుండా ఏకాంతంగా జరుగనుండగా, ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాలకు భక్తులు లేకపోవడం ఇదే తొలిసారి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ, ఏడు కొండల ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించింది. రంగనాయకుల మండపం, కల్యాణ వేదిక, ఆలయ ప్రాంగణం, మాడ వీధులు తదితరాలను విద్యుత్ దీపాలతో అలంకరించింది.

నేటి సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వామివారు పెద్ద శేషవాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మాడ వీధుల్లో ఊరేగింపులు ఉండబోవని, టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. భక్తులు లేకుండా స్వామివారి రథం కదలబోదు కాబట్టి, రథోత్సవాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపింది. ఇక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి ఆహ్వానాన్ని అందించారు. దీనిపై స్పందించిన జగన్, గరుడోత్సవం రోజు తిరుమలకు వెళ్లాలని నిర్ణయించారు.
Tirumala
Tirupati
Brahmotsavams

More Telugu News